Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

  • భారత్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య ఎలాంటి తేడా లేదు..
  • రెండు సరిహద్దుల్లో ఒకే శత్రువు ఉన్నాడు..
  • పాకిస్తాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Khawaja Asif

Khawaja Asif

Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీకి, కాబూల్‌కి మధ్య ఎలాంటి తేడా లేదు’’ అని అన్నారు. పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ప్రస్తుతం ఒకే శత్రువు ఉన్నాడని అన్నారు. పాకిస్తాన్ భారత్‌కు ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఆఫ్ఘాన్ విషయంలో కూడా అలాగే స్పందిస్తామని ప్రగల్భాలు పలికారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు ‘‘ప్రాక్సీ’’గా మారిందని ఆరోపించారు.

Read Also: CM Vijay: నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?

ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఆఫ్ఘాన్ తమకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘాన్ అధికారులు కేవలం నోటితో మాత్రమే హామీలు ఇస్తున్నారని, లిఖితపూర్వక హామీలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని అన్నారు. వారు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపకపోతే యుద్ధం జరుగుతుందని ఆఫ్ఘాన్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఖతార్, సౌదీ అరేబియా, టర్కీల భాగస్వామ్యంతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించడానికి పాక్ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

పాకిసాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదంతో పాటు పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సహకరిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేసేందుకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ సర్కార్ సహకరిస్తుందని పాక్ ప్రధాన ఆరోపణ. ఈ వివాదంపై పలుమార్లు పాక్ ఆఫ్ఘాన్‌లోని ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. తాలిబాన్లు కూడా పాక్ సరిహద్దుల్లోని సైనిక పోస్టులపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.