కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది.. దీనికి కారణం.. రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే కారణం.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పాలసీని తప్పుబడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు వృథా అయిన టీకాలతో సహా 20,80,09,397 టీకాలను వినియోగించినట్లు కేంద్రం పేర్కొంది.. దీంతో.. ప్రస్తుతం 1.82 కోట్లకుపైగా టీకాలు ఆయా రాష్ట్రాలు, యూటీల వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ చెబుతోంది.. వీటికి అదనంగా రాబోయే మూడు రోజుల్లో 4,86,180 డోసులు రాష్ట్రాలకు అందిస్తామని ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ 18-44 ఏజ్ గ్రూప్‌కు వ్యాక్సినేషన్ జరగని పరిస్థితి తెలిసిందే.