Bangladesh: బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి, ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్‌లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందని చెప్పారు.
గురువారం అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కుషియారా నది సమీపంలో ఆలయంలో ఈ ఘటన జరిగింది. కుషియారాలో నిమజ్జన ఘాట్‌లో ఉన్న మానస ఆలయ పునరుద్ధరణకు ఇటీవల అస్సాం ప్రభుత్వం 3 లక్షల రూపాయలను మంజూరు చేసింది. అయితే, బంగ్లాదేశ్ జకింగంజ్ సరిహద్దు అవుట్‌పోస్టుకు చెందిన కొంత మంది సిబ్బంది స్పీడ్ బోట్ ద్వారా భారత సరిహద్దుల్లోకి వచ్చిన, ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల్ని బెదిరించారు. వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ నివసించే స్థానిక హిందువుల్ని బెదిరించినట్లు సమాచారం. ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తే కాల్పులు జరుపుతామని హెచ్చరించినట్లు సమచారం. ఈ ఆలయం కనిపించడం తమ దేశంలోని ముస్లింలకు ఇబ్బందికరంగా ఉందని, నమాజ్ తర్వాత లేదా మసీదు నుంచి ఆలయాన్ని చూడటం హారామ్ అని పేర్కొన్నారని తెలిసింది.
Read Also: Amaravati Construction Work: అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
పరిస్థితి విషమించకముందే భారత్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అక్కడికి చేరుకుని గ్రామస్థులు, బంగ్లా గార్డ్స్‌కి మధ్య ఉద్రిక్తత పెరగకుండా తగ్గించింది. భారత్ భూభాగంలోకి వచ్చి, భారతీయులను బెదిరించే అధికారం మీకు లేదని బంగ్లా గార్డ్స్‌కి బీఎస్ఎఫ్ హెచ్చరించింది. ఆలయ పనులు కొనసాగుతాయని బీఎస్ఎఫ్ చెప్పింది. స్థానికులు, బీఎస్ఎఫ్ నుంచి బలమైన ప్రతిఘటన ఎదురుకావడంతో బంగ్లాదేశ్ గార్డ్స్ వెనక్కి తగ్గారు.
ఈ ఘటనపై బీఎస్ఎఫ్ బోర్డర్ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు చెప్పింది. భారత భూభాగంలోకి ప్రవేశించే ముందు బీఎస్ఎఫ్‌కి తెలియజేసి,అనుమతి పొందాలని, ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒకరి భూభాగంలోకి ఒకరు వచ్చే క్రమంలో ఆయుధాలు కలిగి ఉండొద్దని చెప్పింది. స్థానికులు బంగ్లాదేశ్‌కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆలయ పునరుద్ధరణ చేపట్టే కార్మికులకు బీఎస్ఎఫ్ రక్షణ కల్పించింది. ఆ ప్రాంతంలో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించారు.