Republic Day: భారత చివరకు ప్రత్యర్థి పాకిస్తాన్. దాయాది దేశం ఏర్పడినప్పటి నుంచీ భారత్‌ను చిరాకు పరచాలనే చూస్తోంది. భారత్ ఎదుగుతుంటే తట్టుకోలేక ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించుకుంటోంది. 1947 నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు. పలు సందర్భాల్లో మిత్రుత్వం కోసం చేయిచాచినా, పాక్ తన బుద్ధిని మార్చుకోలేదు. సాధారణంగా ప్రతీ ఏడాది మన గణతంత్ర దినోత్సవానికి విదేశాలకు చెందిన ముఖ్యులు అతిథులుగా ఆహ్వానించబడుతుంటారు. అయితే, రెండు సార్లు భారత్ పాకిస్తాన్‌కు చెందిన నేతల్ని రిపబ్లిక్ డే ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానాలు విభజన గాయాలు ఇంకా మానని కాలంలో జరిగాయి.
1955లో నెహ్రూ కాలంలో తొలి ఆహ్వానం..
1955లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ గవర్నర్ జనరల్ సర్ మాలిక్ గులాం మహ్మద్‌ను గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ ఏడాదే రిపబ్లిక్ డే పెరేడ్ రాజ్‌పథ్( ప్రస్తుతం కర్తవ్యపథ్)లో నిర్వహించారు. దీనికి ముందు ఈ పరేడ్ ఇర్విన్ స్టేడియం(ఇప్పటి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో జరిగింది.
మాలిక్ గులాం మహ్మద్ పాకిస్తాన్ మూడో గవర్నర్ జనరల్. బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసీఎస్) అధికారిగా పనిచేశారు. పాకిస్తాన్ తొలి దశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, ఈయన పాలనలోనే పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదన్న విమర్శలు వచ్చాయి. ప్రధానిని తొలగించడం, రాజ్యాంగ సభను రద్దు చేయడం వంటి చర్యలు పాకిస్తాన్‌లో సైనిక-పౌర అసమతుల్యతకు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది.
1965: శాస్త్రి ఆహ్వానం.. పాక్ వెన్నుపోటు..
నెహ్రూ తర్వాత 10 ఏళ్లకు 1965లో లాల్ బహదూర్ శాస్త్రి మరోసారి పాకిస్తాన్ నేతను రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పాక్ వ్యవసాయ శాఖ మంత్రి రానా అబ్దుల్ హమీద్ ఈసారి భారత అతిథిగా వచ్చారు. ఈ ఆహ్వానం భారత్-పాక్ మధ్య సంబంధాలను బలపరచాలనే ఉద్దేశ్యంతో కూడుకున్నది.
జనవరిలో అతిథిగా ఆహ్వానిస్తే, ఏప్రిల్‌లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. ఏప్రిల్ 1965లో పాకిస్తాన్ రాన్ ఆఫ్ కచ్‌లో సైనిక దాడిని చేసింది. ఆగస్టులో ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కాశ్మీర్‌లోకి చొరబాటుకు ప్రయత్నించింది. చివరకు 1965 భారత్-పాక్ యుద్ధం జరిగింది.
మోడీ హయాంలో కూడా..
దాదాపు 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా పాక్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అయితే, రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం వంటి కార్యక్రమాలకు మాత్రం పాక్ నేతల్ని అతిథులుగా ఆహ్వానించలేదు. కానీ 2014లో తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆమ్బానించారు. 2015లో అనూహ్యంగా లాహోర్‌ను సందర్శించారు. కానీ, పాక్ మళ్లీ అదే బుద్ధిని చూపించింది. ఉగ్రవాదుల దాడులు, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.