Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని ఎయిర్ నష్టాలను చవిచూసినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ శనివారం అంగీకరించారు. అయితే, భారత్‌కి చెందిన 6 ఫైటర్ జెట్స్‌ని కూల్చేశామనే పాకిస్తాన్ వాదనల్ని మాత్రం ఆయన తిరస్కరించారు. అవి పూర్తిగా తప్పు అని చెప్పారు. తొలిసారిగా, సైన్యం భారత్ కొన్ని విమానాలు కోల్పోయినట్లు ధ్రువీకరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణల్లో మొదటి రోజు ఎయిర్ నష్టాలను చవిచూసిన తర్వాత భారత్ తన వ్యూహాలను మార్చుకుందని, మూడు రోజుల తర్వాత పొరుగువారు కాల్పుల విరమణ ప్రకటించే ముందు నిర్ణయాత్మక ఆధిక్యాన్ని స్థాపించిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.
బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ మాట్లాడుతూ.. జెట్స్ కూలిపోవడం ముఖ్యమైన విషయం కాదని, అవి ఎలా, ఎందుకు కూలిపోయాయన్నదే ముఖ్యమని చెప్పారు. తద్వారా సైన్యం తన వ్యూహాలను మెరుగుకుపరుచుకుని మళ్లీ దాడి చేయగలదని చెప్పారు. మే మొదటి వారంలో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ యుద్ధవిమానాలను కోల్పోయిందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ మంచి విషయం ఏంటంటే, మేము చేసిన వ్యూహాత్మక తప్పులను అర్థం చేసుకున్నాము, సరిదిద్దుకున్నాము, రెండో రోజుల్లో తర్వాత దాడిని మళ్లీ అమలు చేశాము. మేము మా అన్ని యుద్ధవిమానాలను సుదూర లక్ష్యాల వైపు నడిపాము’’ అని అన్నారు.
Read Also: Congress: ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. బీజేపీ ఆగ్రహం..
మే 7, 8, 10 తేదీల్లో పాకిస్తాన్ లోకి వెళ్లి వారి వైమానిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించామని, మే 10న అన్ని రకాల ఆయుధాలతో అన్ని రకాల విమానాలను దాడులు చేశాయని చెప్పారు. అయితే, ఘర్షణ సమయంలో పాకిస్తాన్‌కి చైనా నుంచి వాస్తవ సహాయం లభించలేదని వెల్లడించారు. పాక్‌తో ఘర్షణ ఆగిపోయినప్పటికీ, మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని ఆయన చెప్పారు.
పోరాటంలో నష్టాలు కూడా ఒక భాగని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చెబుతున్నట్లు ఆరు జెట్స్‌ని కూల్చేశామనేది తప్పని వెల్లడించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ భద్రతా శిఖరాగ్ర సమావేశమైన షాంగ్రి-లా డైలాగ్‌కు హాజరవుతూ సింగపూర్‌లో ఉన్నారు. దీనికి ముందు, మే 11న జరిగిన మీడియా సమావేశంలో భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ మార్షల్ ఎకె భారతి, ఆపరేషన్ సిందూర్ సమయంలో విమాన నష్టాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, “పోరాటంలో నష్టాలు ఒక భాగం” అని పేర్కొన్నారు, అయితే అన్ని ఐఎఎఫ్ పైలట్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని ధృవీకరించారు.