ప్రతీ ఏడాది ఉల్లి ధరలు సామాన్యుడికి కంట తడి పెట్టిస్తుంటాయి. కొన్ని సార్లు కిలో ఉల్లి ధర ఏకంగా రూ.100ను దాటి పోతుంది. దీంతో సామాన్యుడిపై విపరీత భారం పడుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఉల్లి ధరల గురించి ప్రజలు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉల్లిని నిల్వ చేయడం ఇదే తొలిసారి. దీంతో పండగల సమయంలో, ధరలు పెరుగుతున్న సమయంలో మార్కెట్ లోకి నిల్వ చేసిన ఉల్లిని ప్రభుత్వం తీసుకువచ్చి ధరల పెరుగుదలను అడ్డుకుంటుంది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉండే అవకాశం ఉందని.. దీంతో ఆ సమయంలో ఉల్లి ధరలను స్థిరీకరించడానికి ఈ నిల్వలు ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్భనం రేటు 7 శాతంగా ఉన్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా ఈ బఫర్ స్టాక్ ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఉల్లిని ఎక్కువగా పండిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ఉల్లిని ఎక్కువగా పండించే రాష్ట్రాల రైతుల నుంచి ఉల్లిని కేంద్రం సేకరించి నిల్వ చేస్తోంది. దీంతోనే ఈ ఏడాది వర్షాకాలంలో ఉల్లి కొరత ఏర్పడలేదు.
Read Also: KTR Tweet: పార్లమెంట్ లో పదాల నిషేధంపై సీరియస్ .. ఉదహరిస్తూ ట్వీట్
దేశంలో సాధారణంగా ఏప్రిల్-జూన్ నెలలో ఉల్లిని సాగు చేస్తుంటారు. ఈ సమయంలోనే 65 శాతం పంట సాగువుతుంది. దీంతో అక్టోబర్- నవంబర్ నెలల్లో ఉల్లికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ ఈ సారి ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా కేంద్ర నిల్వలు ఉపయోగపడనున్నాయి. ఉల్లిని అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో మహరాష్ట్ర ఒకటి.. ఈ రాష్ట్రంలో ఉత్పత్తిని బట్టే ధరలు నిర్ణయించబడుతాయి. మహారాష్ట్రలోని లాసల్ గావ్ లో ప్రస్తుతం క్వింటాల్ ఉల్లిధర రూ. 1225 గా ఉంది. ఇప్పటి వరకు ధర స్థిరంగానే ఉంది.