Ant attack on Odisha village.. Officials’ operation: ఒడిశాలోని ఓ గ్రామంలోని ప్రజలకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా చీమలకు భయపడి ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రజలు తిన్నా, పడుకున్నా కూడా వారి చుట్టూ చీమల మందును చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చీమల కుట్టడం వల్ల ఎర్రని దద్దుర్లు, దురదలతో ప్రజలు వణికిపోతున్నారు. ఒడిశాలోని పూరీ జిల్లా చంద్రదేయ్‌పూర్ పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణసాహి గ్రామంలో లక్షలాదిగా ఎర్రని, నిప్పు చీమలు దండయాత్ర చేస్తున్నాయి. సమీపంలో అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యే ఈ చీమలు ప్రస్తుతం గ్రామాల్లో తిష్ట వేశాయి. ఈ చీమలను అరికట్టేందుకు ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం, జిల్లా యంత్రాగం ఆపరేషన్ ప్రారంభించింది.
ఇళ్లు, రోడ్లు, పొలాలు, చెట్లు ఇలా గ్రామంలోని అన్ని చోట్ల చీమల గుంపులే దర్శనం ఇస్తున్నాయి. ప్రజలతో పాటు పెంపుడు జంతువులు, ఇంట్లో ఉండే బల్లులు కూడా ఈ చీమల బారిన పడుతున్నాయి. ఈ చీమల బెదడ వల్ల గ్రామంలో ఇప్పటికే మూడు కుటుంబాలు ఊరు వదిలి పారిపోయారు. తమ బంధువల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. గతంలో గ్రామంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదల తర్వాత చీమలు పెద్ద ఎత్తున గ్రామంలోకి చేరాయి.
Read Also: Digvijay Singh: కేసీఆర్, జగన్‌లపై సెటైర్లు.. గులాంపై గుర్రు
సీనియర్ శాస్త్రవేత్త సంజయ్ మొహంతి మాట్లాడుతూ.. గ్రామం చుట్టూ నది, అడవులు ఉన్నాయి. ఇటీవల వరద నీరు గ్రామాన్ని ముంచెత్తడంతో.. చీమలు ఊర్లోకి చేరాయని ఆయన వెల్లడించారు. చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆ స్థలాన్ని గుర్తించి తర్వాత రెండు మీటర్ల పరిధిలో పురుగు మందులను పిచికారీ చేస్తామని తెలిపారు. ఈ సమస్యకు ప్రధాన కారణం రాణి చీమ అని.. ముందుగా దాన్ని గుర్తించి చంపడమే మా ప్రథమ కర్తవ్యం అని అన్నారు. అయితే ఈ చీమల స్వభావాన్ని గుర్తించేందుకు శాంపిళ్లను ప్రయోగశాలకు పంపినట్లు ఆయన వెల్లడించారు.