PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సమయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపై కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులు ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసిందని గుర్తుచేశారు. శరద్ పవార్ ప్రభుత్వాన్ని కూలగొట్టారని అన్నారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో ఏం జరిగిందో చూశామని.. ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పడగొట్టే ప్రయత్నాలు చేసిందని అన్నారు.
Read Also: Mallikarjun Kharge: గతంలో “వాజ్పేయి కూడా ఈ పదాలను అన్నారు”.. నా మాటల్ని ఎందుకు తొలగించారు.
ఏ పార్టీ వ్యక్తుల ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారు..? అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు ప్రధాని. ఎన్నికైన ప్రభుత్వాలను 90 సార్లు పడగొట్టారని.. ఒక ప్రధాన మంత్రి ఆర్టికల్ 356ను 50 సార్లు ఉపయోగించారని, ఆమె ఇందిరా గాంధీ అని అన్నారు. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎన్నికైతే అది అప్పటి ప్రధాని నెహ్రూకు నచ్చలేదని, ఆ ప్రభుత్వాన్ని కూడా కూల్చేశారని కాంగ్రెస్ ను విమర్శించారు.
గాంధీ-నెహ్రూ కుటుంబం పేరు మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని ఓ నివేదికలో చదివానని ప్రధాని మోదీ అన్నారు. నెహ్రూ అంత గొప్పవ్యక్తి అయితే, ఆ కుటుంబం నెహ్రూ ఇంటిపేరును ఎందుకు ఉపయోగించడం లేదని, ఎందుకు దూరంగా ఉంటుందని ప్రశ్నించారు. దీంట్లో భయం, అవమానం ఏంటని ప్రధాని మోదీ, గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ అడిగారు.