Noida Towers Will Be Demolished..using 3,500 kg Explosives: నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తేలడంతో.. ఏకంగా సుప్రీంకోర్టు కూల్చేవేతకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 28న మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా సూపర్ టెక్ లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయనున్నారు. ఇప్పటికే అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. కూల్చివేత సమయంలో స్థానికులు దూరంగా ఉండాలని కోరారు.
దాదాపుగా 100 మీటర్ల ఎతైన నోయిడా ట్విన్ టవర్స్ భవనం కూల్చివేత ఈ నెల 21నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మరింత గడువు కావాలని నోయిడా అథారిటీ చేసిన అభ్యర్థనతో కూల్చివేతను ఆగస్టు 28కి మార్చింది. ఈ జంట టవర్లలో మొత్తం 900 ఫ్లాట్లు, 21పైగా దుకాణాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ 40 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఏకంగా 3500 కిలోల( 35 క్వింటాళ్ల) పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. భవనంలోని పిల్లర్లకు 9400 రంధ్రాలను చేసి వాటిలో పేలుడు పదార్థాలు నింపి భవనాన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే ఈ భవనం వద్దకు పేలుడు సామాగ్రితో పాటు ఇతర సామాగ్రిని చేర్చుతున్నారు.
Read Also: Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?
సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ నివాసితులను ఆగస్టు 28 ఉదయం 7 గంటల్లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సాయంత్రం 4 గంటల తర్వాతే రావాలని అధికారులు స్థానికులకు తెలిపారు. యూకే నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. ఈ పేలుడు వల్ల 50 మీటర్ల వ్యాస్తార్థం వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత సమయంలో స్థానికంగా ఉన్న రెండు సొసైటీల నుంచి ఎలాంటి వాహనాలను ఈ ప్రాంతంలోని అనుమతించమని తెలిపారు అధికారులు. ఈ భవనం కూల్చివేత కోసం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను ఆగస్టు 28న మధ్యాహ్నం 2:15 నుండి 2.45 గంటల వరకు వాహనాల రాకపోకలకు నిలిపివేయనున్నారు. కూల్చివేత సంస్థ ఎడిఫైస్ ఇంజినీరింగ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ కూల్చివేతపై చర్చించాయి. కూల్చివేత ప్రాంతానికి కూతవేటు దూరంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను నిలిపి ఉంచడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.