Karnataka CM Post: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. సీఎం పదవి నుంచి సిద్ధ రామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇక, తాజాగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా వినిపిస్తోన్న వ్యాఖ్యలకు తెర పడింది. ఐదేళ్లు తానే కర్ణాటక సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. మీకెందుకు అలాంటి డౌట్స్ ఉన్నాయి? అని మీడియాను ప్రశ్నించారు. అలాగే, నాయకత్వ మార్పు గురించి విపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ చేస్తోన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా సిద్ధరామయ్య కొట్టిపారేశారు. వారేమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమా అని ప్రశ్నించారు.
Read Also: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
మరోవైపు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎంకు అండగా ఉండటం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు. నేను సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వాలి.. కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చెబితే అది చేయాలని చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. మరో 2, 3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయన ఎంత కృషి చేశారో అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం డీకే గురించే మాట్లాడుతుంది.. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ‘విప్లవాత్మక’ మార్పులు జరుగుతాయని మంత్రి కేఎన్ రాజన్న కూడా పేర్కొన్నారు.