No Name Railway Station In India Near Purv Bardhaman: పేరు లేని రైల్వే స్టేషన్ ఎక్కడైనా ఉంటుందా? కానీ, మన భారతదేశంలో అలాంటి ఒక రైల్వే స్టేషన్ ఉంది. బెంగల్‌లోని బర్ధమాన్ నగరానికి కొంత దూరంలో ఈ స్టేషన్ ఉంది. అక్కడ రైలు ఆగుతుంది కానీ, ఆ స్టేషన్‌కి మాత్రం పేరు లేదు. ఇందుకు ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే.. తూర్పు బర్ధమాన్ జిల్లాలో రైనా, రైనాగర్ అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల మధ్య 2008లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు. దీనికి రైనాగర్ అనే పేరు పెట్టారు. ఈ పేరే ఆ రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఆ రైల్వే స్టేషన్‌కు ‘రైనా’ పేరు ఎందుకు పెట్టలేదని ఆ గ్రామం ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న రైనాగర్ ప్రజలు.. ఆల్రెడీ పెట్టిన పేరును తొలగించడానికి వీలు లేదంటూ పట్టుపట్టారు.
నిజానికి.. ఆ రైల్వే స్టేషన్ రైనా గ్రామానికే కొంచెం దగ్గరలో ఉంటుంది. పైగా.. స్టేషన్ భవనం సైతం రైనా గ్రామంలోనే ఉంది. అందుకే, ఆ స్టేషన్‌కి తమ ఊరి పేరే పెట్టాలని రైనా గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఇందుకు ఒప్పుకోని రైనాగర్ గ్రామ ప్రజలు.. ఘర్షణకు దిగారు. చినికి చినికి గాలి వానలాగా.. ఈ రెండు గ్రామాల మధ్య పెద్ద గొడవ నెలకొంది. ఈ వ్యవహారం రైల్వే శాఖ దాకా వెళ్లడంతో.. ఆ రెండు గ్రామాల మధ్య గొడవని అదుపు చేసేందుకు. స్టేషన్ పేరుని అన్ని సైన్ బోర్డుల నుంచి తొలగించింది. అంతే, అప్పటి నుంచి ఆ స్టేషన్ పేరు లేని స్టేషన్‌గా నిలిచిపోయింది. రెండు గ్రామాల వాళ్లు ‘తమ ఊరి పేరంటే తమ ఊరి పేరే పెట్టాలని’ డిమాండ్ చేస్తుండడంతో, అధికారులకు ఏం చేయాలో తెలీక మీమాంసలో పడ్డారు. అయితే.. రైల్వే ఇస్తోన్న టికెట్‌పై మాత్రం రైనాగర్ అనే పేరు ఉంటోంది. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో ఏమో?