మహారాష్ట్రలో లాక్ డౌన్‌పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం లేదని చెప్పారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దానిని మహా జనతా కర్ఫ్యూగా సంబోధించాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఉంది. రెమిడెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోందని అన్నారు.
తక్షణం ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని ఆయన అన్నారు. ఇక పేదలకు 3 కిలోల గోధుమలు.. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని ఆయన అన్నారు. ఇక రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసి వేస్తున్నామని, మే 1 వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల మూసివేత ఉంటుందని అన్నారు. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అన్నారు. పెట్రోలు బంకులు, బ్యాంకింగ్ సంస్థలు పనిచేస్తాయని, హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్‌లకు మాత్రమే అనుమతిస్తామని అన్నారు.