Kiren Rijiju: ‘‘మిస్ ఇండియా’’ పోటీల్లో దళితులు, ఆదివాసీలు లేరంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ‘‘బాల బుద్ధి’’ నుంచి మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. కులగణనను డిమాండ్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. 90 శాతం జనాభా భాగస్వామ్యం లేకుండా భారతదేశం సరిగా పనిచేయదని శనివారం అన్నారు. దళిత, ఆదివాసీ(గిరిజన), ఓబీసీ మహిళలు లేని మిస్ ఇండియా జాబితాను తాను చూశానని అన్నారు. కొందరు క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతారు, కానీ ఎవరూ చెప్పులు కుట్టేవారు గురించి మాట్లాడరని అన్నారు. మీడియాలో యాంకర్లలో కూడా 90 శాతం మంది లేరని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Hyderabad Ponds: 18 చోట్ల కూల్చివేతలు.. 43 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ! ప్రముఖుల లిస్ట్ ఇదే
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. దేశానికి ద్రౌపది ముర్ము గిరిజనురాలైన మొదటి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఓబీసీకి చెందినవారు, అనేక మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కేబినెట్ మంత్రులుగా ఉన్నారని అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, చలనచిత్రాలు, క్రీడలలో రిజర్వేషన్లు కోరుకుంటున్నాడు! ఇది ‘బాలక్ బుద్ధి’ సమస్య మాత్రమే కాదు, అతనిని ఉత్సాహపరిచే వ్యక్తులు కూడా అంతే బాధ్యత వహిస్తారు!’’ అని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు, కానీ మీ విభజన వ్యూహాలలో వెనకబడి వర్గాలను ఎగతాళి చేయొద్దు అని సూచించారు.
రాహుల్ గాంధీ జీ, ప్రభుత్వాలు మిస్ ఇండియాని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు ఒలింపిక్స్‌కి క్రీడాకారుల్ని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు సినిమాల్లో నటీనటుల్ని ఎంపిక చేయవని అన్నారు. అలాగే, ఐఏఎస్, ఐపీఎష్, ఐఎఫ్ఎష్ వంటి అన్ని టాప్ రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లు మార్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించదని రాహుల్ గాంధీనే స్పష్టం చేశారు. అయితే, అతను భారత రాష్ట్రపతిగా గిరిజనురాలు ఉండటం, ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండటాన్ని చూడటం లేదు అని అన్నారు.కులగణన డిమాండ్‌తో రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు డిమాండ్ చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.