Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. సమావేశం జరిగే సమయంలో జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో నితీశ్ కుమార్ భేటీ అయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ సమావేశం చోటు చేసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్రమోడీని అడ్డుకోవాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడాలని పలువురు నేతలు భావిస్తున్నారు. గతంలో నితీష్ కుమార్ పలుమార్లు కాంగ్రెస్ కూడా ఇందులో భాగం కావాలని ఆహ్వానించారు. ఇందులో భాగంగానే ఈ రోజు భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ఇదే విధంగా పలువురు విపక్ష నేతలను నితీష్ కుమార్ కలవనున్నట్లుగా సమాచారం.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్.. రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఇదో చారిత్రాత్మక అడుగు అని, ప్రతిపక్ష పార్టీల దార్శనికతను పెంపొందించుకుని ముందుకు సాగుతాం, దేశం కోసం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు చారిత్రాత్మక సమావేశం జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని, అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని మేమంతా నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే అన్నారు.