NTV Telugu Site icon

Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి

Laluprasadyadav

Laluprasadyadav

బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీష్ తన మనస్సాక్షిని, తన ఆత్మను, బీహార్ గుర్తింపును, బీహార్ ఓట్ల ప్రాముఖ్యతను కేంద్రానికి అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం సోమవారం తేల్చిచెప్పిన నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్.. ఆర్థికంగాను, పారిశ్రామికంగాను బీహార్ సహా ఇతర వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదని తేల్చిచెప్పారు.

బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలన్నది జేడీయూ చిరకాల డిమాండ్. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ లభించలేదు. దీంతో బీహార్‌లోని నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీయూ, ఏపీలోని చంద్రబాబుకు చెందిన టీడీపీ మద్దతుతో మోడీ 3.0 సర్కార్ ఏర్పడింది. దీంతో ఈసారైనా ఆ కల నెరవేర్చుకోవాలని జేడీయూ భావించింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాల ముందు కేంద్రం ముందు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ చివరకు నితీష్ సర్కార్ చుక్కెదురైంది. హోదా ఇచ్చే ప్రసక్తేలేదని కేంద్రం తేల్చిచెప్పింది.

ప్రత్యేక హోదా అనేది వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర మద్దతుతో ఈ హోదా లభిస్తోంది. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ.. 1969లో ఐదోవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం), ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.