Asaduddin Owaisi: జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే నితీష్ కుమార్ సీఎం అవుతారని, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్రమోడీ ఇష్టం మేరకే పాలన సాగుతుందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో జేడీయూ జతకట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pinarayi Vijayan: కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..
ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నితీష్ ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ-బీ టీమ్ అంటూ తమను ఎగతాళి చేసిన నితీష్ కుమార్, ఇప్పుడు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు. రాజకీయ అవకాశవాదం అనే పదానికి నితీష్ కుమార్ అర్థమని, ఇందులో ఆయన రికార్డులు బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. అతను బీజేపీతో కలుస్తారని ఎప్పటి నుంచో చెబుతున్నానని అయితే, ఎవరూ నమ్మలేదని అన్నారు.
తేజస్వీ యాదవ్ నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు అతను అదే బాధను అనుభవిస్తున్నాడు అని అన్నారు. యాదవ్, అతని కుటుంబం బీహార్ ప్రజలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రధాని మోడీ అతనిని విమర్శించాడు, దేశ మహిళల్ని రక్షిస్తానని అన్నాడని, ఇప్పుడు నితీష్ కుమార్‌తో కలిసి ప్రధాని టీ తాగుతున్నాడని అన్నారు.