New toll policy: “కొత్త టోల్ విధానాన్ని” తీసుకురాబోతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఏప్రిల్ 1 లోపు వినియోగదారులకు సహేతుకమైన రాయితీలతో ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెడుతుందని అన్నారు. శనివారం బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ఈ ప్రకటన చేశారు. టోల్ ఛార్జీల గురించిన ఆందోళనలను పరిష్కరించడం, రోడ్డు మౌలిక సదుపాయాల నిధులను మెరుగుపరచడం ఈ చర్య లక్ష్యం అని అన్నారు. దేశంతో టోల్ వసూల్లు గణనీయంగా పెరిగాయి. 2023-24లో రూ.64,809.86 కోట్లకు చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం కంటే 35% ఎక్కువ. 2019-20లో ఈ వసూళ్లు రూ. 27,503 కోట్లుగా ఉన్నాయి.
Read Also: New toll policy: ఏప్రిల్ 1 కన్నా ముందే “కొత్త టోల్ విధానం”.. గడ్కరీ కీలక ప్రకటన..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాన్ని కూడా గడ్కరీ వివరించారు. భారతదేశ జనాభాలో 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, అయితే ఇది జాతీయ ఆర్థిక వృద్ధికి 12 శాతం మాత్రమే దోహదపడుతుందని చెప్పారు. ‘‘మన రైతులు ఆహారాన్ని పండించే వారే కాకుండా, ఇంధన ప్రదాతలు కూడా అవుతారు’’ అని ఆయన అన్నారు. బయో ఇంధన ఉత్పత్తి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించే వ్యవసాయం అభివృద్ధి విధానాన్ని వివరించారు.
దేశవ్యాప్తంగా 400 బయో ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, వ్యవసాయ వ్యర్థాలను బయో-CNG మరియు బయో-బిటుమెన్‌లుగా మార్చడం, లాజిస్టిక్ ఖర్చులను 14-16 శాతం నుంచి 9 శాతానికి తగ్గించడం, గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలను డెవలప్ చేయడం, అధునాతన నిర్మాణ సాంకేతిక అమలు చేయడం వంటి కీలక కార్యక్రమాలను వెల్లడించారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాలు సరిపోతాయని గడ్కరీ అన్నారు.