పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారమే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో 60 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టమే అమల్లో ఉంది. దీని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే శనివారం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. త్వరలో పార్లమెంట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక.. మరింత పరిశీలన కోసం హౌస్ ప్యానెల్‌కు పంపిస్తారు. ప్రస్తుత పన్ను చట్టాలను సరళీకృతం చేయడమే కొత్త బిల్లు లక్ష్యం అని స్పష్టం చేశారు. కొత్త సెస్సును మాత్రం ప్రవేశపెట్టబోమని పేర్కొన్నారు. అయితే కొత్త బిల్లులో అనేక సవరణలు ఉంటాయని.. ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమీక్ష..
ఇక 2024, జూలైలో బడ్జెట్ ప్రసంగం చదువుతుండగా సీతారామన్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను చట్టం మారస్తామన్నారు. 1961 నాటి ఆదాయపు పన్ను గురించి సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. కొత్త బిల్లు ప్రస్తుత వ్యవస్థను సమూలంగా మారుస్తుందని.. ప్రత్యక్ష పన్ను చట్టాలు అందరికీ అర్థమయ్యేలా చేస్తుందని సీతారామన్ చెప్పుకొచ్చారు.
జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడతలో మార్చి 10న ప్రారంభమై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ.. ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: జోస్ బట్లర్ వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔట్!