Nirmala Seetaraman: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులను మార్పు చేయడమే కాకుండా.. రాష్ట్రాల ఇన్‌ఛార్జ్ లను మార్చడం.. రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్ లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ని మార్చి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పటికే వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజును తొలగించి.. ఆయన స్థానంలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని నియమించారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై గురువారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో కీలక బాధ్యతలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Read also: Tomatoes For Flight Bookings: ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయ స్థాయిలో బీజేపీ అధిష్టానం పార్టీ పరంగా కీలక మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులుగా సీనియర్లను, కేంద్ర మంత్రులను నియమిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తమిళనాట తమ సత్తా చాటే దిశగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది.
ఇప్పటికే 11 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పార్టీ పరంగా కార్యక్రమాలను విస్తృతం చేశారు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై రూపంలో కూటమికి బీటలు వారుతున్నాయనే బెంగ బీజేపీ జాతీయ అధిష్టానంలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పరోక్షంగా ఒంటరిగా సత్తా చాటేందుకు సిద్ధం లేదా, తమ నేతృత్వంలో కూటమి అన్నట్లు అన్నామలై తీరు ఉంటోంది. దీనిని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, ఎన్‌డీఏలో కీలకంగా ఉన్నా అన్నాడీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అన్నామలైకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. అన్నాడీఎంకే నిర్ణయాలను ఇతర మిత్రులు అనుసరిస్తున్నా, అన్నామలై రూటు సపరేటు అన్నట్లుగా ఉంటోంది. ఇది బీజేపీ జాతీయ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టి ఉంది. ఇప్పటికే అన్నామలైకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు జాతీయ అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వేళ అన్నామలై రూపంలో ఎక్కడ కూటమికి బీటలు వారుతాయో అనే బెంగ బీజేపీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Hi Nanna : అదరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న ‘హాయ్ నాన్న’ గ్లింప్స్..
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే అన్నామలైను తప్పించడం మంచిదా? అన్న యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అన్నామలైకు వ్యతిరేకంగా పార్టీలోనే అనేక మంది నేతలు గళం వినిపిస్తుండడాన్ని పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అన్నామలై చురుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన్ని తప్పించకుండా, ఆయనకుపై పోస్టులో కీలకంగా ఒకరిని నియమించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం గురించి చర్చించేందుకే అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన అన్నామలై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేతో సర్దుకు పోయే విధంగా అన్నామలైకు నేతలు ఉపదేశం చేసినట్లు సమాచారం. అలాగే అన్నామలైను తప్పించడమా లేదా..? ఆయన్నే కొనసాగిస్తూ, పైస్థాయిలో మరో పదవిలో కీలక వ్యక్తిని కూర్చోబెట్టే విషయంపై సమాలోచన జరిగినట్లు బీజేపీలో చర్చ సాగుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కర్ణాటకకు చెందిన రవి, కో–ఇన్‌చార్జ్‌గా తెలంగాణకు చెందిన సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు మిగిలిన వారందరినీ సమన్వయ పరుస్తూ, పార్టీపరంగా రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం తమిళనాడుకు చెందిన నిర్మల సీతారామన్ చక్కగా తమిళం మాట్లాడటమే కాకుండా, ఇక్కడి పరిస్థితులు, రాజకీయ అంశాలపై పూర్తి అవగాహన, పట్టు కలిగిన వారు కావడం ఇందుకు కలిసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయ్యే వరకు ఆమెను అధ్యక్ష పదవిలో కూర్చో పెట్టాలా..? లేకపోతే మరైదెనా కీలక బాధ్యతలు అప్పగించాలా..? అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు చర్చ సాగుతోంది.