NIA: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ మేరకు పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబ్‌లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్‌పూర్, మొహాలీ, పాటియాలా, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
మార్చి 19, జూలై 2న శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌పై జరిగిన దాడుల వెనక కుట్రను ఛేదించడానికి పలు ప్రదేశాల్లో రైడ్స్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ దాడిలో నేరపూరిత చొరబాటు, విధ్వంసం, ప్రజా ఆస్తులకు నష్టం, కాన్సులేట్ అధికారులను గాయపరచడం, భవనాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: ‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
తాజాగా రెండు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో విలువైన సమాచారంతో పాటు నేరారోపణ పత్రాలతో కూడిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడి చేసిన వారిని గుర్తించి, వారిని విచారించిందేకు సిద్ధమవుతున్నామని, భారత వ్యతిరేక శక్తులకు బలమైన సందేశం పంపండంలో భాగంగా ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.
మార్చి 18-19 మధ్య రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై కొన్ని ఖలిస్తాన్ అనుకూల శక్తులు దాడులు చేశాయి. ఈ దాడి తర్వాత జూలై 2న కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ కేసును విచారించేందుకు ఎన్ఐఏ ఆగస్టులో శాన్‌ఫ్రాన్సిస్కోను సందర్శించింది. ఈ దాడిలో పాల్గోన్న యూఎస్ సంస్థలు, వ్యక్తుల సమాచారాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.