మహారాష్ట్రలో అమరావతి ఉమేష్ కోల్హే హత్య కేసులో ఎన్ ఐ ఏ దూకుడు పెంచింది. ఏకంగా మహారాష్ట్రలోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జూన్ 21న అమరావతిలో ఫార్మాసిస్ట్ ఉమేష్ కోల్హేను దుండగులు దారుణంగా హత్య చేశారు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే ఉమేష్ కోల్హేను హత్య చేశారని తెలిసింది. తాజాగా బుధవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించి అనుమానితులు, నిందితుల ఇళ్లలో డిజిటల్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్‌లు, మెమరీ కార్డ్‌లు, డీవీఆర్లు), విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేసే కరపత్రాలు, కత్తులు, ఇతర నేరారోపణ పత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
మొదట్లో ఇది సాధారణ దోపిడికి సంబంధించిన హత్యగానే పోలీసులు ప్రకటించినప్పటికీ.. తర్వాత దీంట్లో కుట్రకోణం దాగుందని తెలిసింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. అంతకుముందు అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఈ హత్య గురించి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ హత్యను పోలీసులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని.. అమరావతి సీపీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేయడం వల్లే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉగ్రలింగులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also: Ather Energy: డీలర్‌షిప్ పేరుతో 12.50 లక్షల టోకరా!
ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే ఈ హత్య చేశారు నిందితులు. ఈ హత్యలో పాకిస్తాన్ తో ఉగ్రసంబంధాలు బయటపడ్డాయి. నిందితులకు దావత్-ఏ-ఇస్లామీ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటన జరగడానికి ముందే ఉమేష్ కోల్హే హత్య జరిగింది. ప్రస్తుతం ఈ రెండు కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది.