కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో అనూహ్యంగా డోలో 650 టాబెట్ల అమ్మకాలు పెరిగిపోయాయి.. ప్రపంచ వ్యాప్తంగా డోలో పేరు మార్మోగిపోయింది.. డోలో 650 వేసుకుంటే చాలు.. కరోనా నుంచి తప్పించుకోవచ్చన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ మాత్రలను కొనుగోలు చేశారు.. భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ డోలోకు డిమాండ్ పెరిగింది.. మైక్రో ల్యాబ్స్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు సైతం తరలివెళ్లాయి డోలో 650 టాబెట్లు.. అయితే, డోలోను తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ పై ఇప్పుడు ఐటీ దాడులు చర్చగా మారాయి.. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలపై బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు..
Read Also: ICC Test Rankings: ఐసీసీ టాప్-10 నుంచి కోహ్లీ అవుట్.. ఆరేళ్ల తర్వాత తొలిసారి
కరోనా పుణ్యమా అంటూ మైక్రో ల్యాబ్స్‌కు డోలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.. ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అదినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా.. ఇప్పుడు దేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చేరారంటే.. దాని వెనుక డోలో మాత్ర ఉందని చెప్పాలి.. కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఏకంగా 350 కోట్ల డోలో 650 మాత్రలు విక్రయాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. దీంతో.. ఒకే ఏడాదిలో దాదాపు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందట.. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే సాగింది.. అయితే, ఇప్పుడు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకేసారి జరిగిన ఈ దాడుల్లో 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని కంపెనీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో భారీగా వెనుకేసుకున్న ఆ సంస్థ.. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.. దీంతో, ఈ దాడులు నిర్వహించినట్టుగా సమాచారం..