Amit Shah: తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఈ సందర్భంగా స్థానిక న్యూస్ ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
Read Also: Israel- Iran Conflict: ఖమేనీని చంపడానికి చాలా వెతికాం.. కానీ, దొరకలేదు!
ఇక, 1967 నుంచి ఏ ద్రవిడ పార్టీ కూడా తమిళనాడులో ప్రభుత్వ అధికారాన్ని మిత్ర పార్టీలతో పంచుకోలేదు.. కాబట్టి అమిత్ షా వ్యాఖ్యలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే, నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ఎన్డీయేలో చేరుతుందా అని అడిగిన ప్రశ్నకు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది అని బదులిచ్చారు. కాగా, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం అవినీతి పరిమితులు దాటిపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.450 కోట్ల విలువైన పోషకాహార కిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని అన్నారు. ఆ నిర్ణయంతో పేదలకు ఆహారం అందకుండా చేస్తోందని మండిపడ్డారు. ప్రజల నాడిని నేను అర్థం చేసుకున్నాను.. తమిళనాడు వాసులు తదుపరి ఎన్నికల్లో డీఎంకెను గద్దె దించుతారని ఖచ్చితంగా చెప్పగలను అని అమిత్ షా తేల్చి చెప్పారు.