దాదాపు 150 ఏళ్ల నాటి రాజద్రోహ సెక్షన్ 124ఏ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోదీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టంకింద ఎటాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలు, పెండింగ్ ట్రయల్స్‌ను కూడా నిలిపేస్తున్నట్టు తెలిపింది. సెక్షన్ 124ఏ కింద కొత్తగా కేసు నమోదైనవారు, ఇప్పటికే జైలులో ఉన్నవారు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని పేర్కొంది.
తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. రాజ్యాంగ నిర్మాణం జరుగకముందు తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగమవుతున్నట్టు ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు ఈ చట్టం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని అభిప్రాయపడింది. చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. సమీక్ష పూర్తయ్యేంతవరకూ ఈ చట్టం కింద కేసులు నమోదుచేయకుండా నిలిపివేయడం సరైనది కాదంటూ విచారణ సందర్భంగా కేంద్రం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. అయితే, ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. కేసు తీవ్రతను పరిశీలించడానికి ఎస్పీ ర్యాంకు అధికారిని నియమిస్తామన్న కేంద్రం ప్రతిపాదనను కూడా తోసిపుచ్చిన ధర్మాసనం.. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని పేర్కొన్నది. ‘హనుమాన్ చాలిసా పఠించినా రాజద్రోహం కింద కేసులు నమోదు చేస్తున్నార’ని అటార్నీ జనరల్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తుచేసింది. రాజద్రోహం చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి జీవితఖైదు విధించవచ్చు. స్వాతంత్య్రానికి 77 ఏండ్ల కంటే ముందు 1870లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
స్వాగతించిన విపక్షాలు:
సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాంగ్రెస్ స్వాగతించింది. నిజాలను వినిపించే గొంతుకలను అణచివేయలేరని కోర్టు తీర్పు ద్వారా తెలుస్తున్నదని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఎడిటర్స్ గిల్డ్ కూడా స్వాగతించింది. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తెలిపారు. రాజద్రోహం చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని మేధావులను అరెస్ట్ చేసి, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే దుర్మార్గపు బీజేపీ ఆలోచన విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నాటకాలుమాని తక్షణమే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాగా.. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో రాజద్రోహం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులకు ఊరట లభించినట్లయింది. ఈ జాబితాలో టూల్‌కిట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరుకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి దిశారవి, బుకర్ ప్రైజ్ విన్నర్, రచయిత్రి అరుంధతి రాయ్, జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్, జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్ తదితరులు ఉన్నారు.
Sarakaru Vaari Paata Public Talk: మహేష్ వన్ మ్యాన్ షో.. అదిరిపోయింది