Narendra Modi Satires On Rahul Gandhi Bharat Jodo Yatra: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడం కోసమే ఈ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. ప్రజలు చాలా ఏళ్ల క్రితమే వాళ్లను గద్దె దింపారంటూ చురకలంటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. తనపై విమర్శలు చేస్తున్నారని, తన(మోడీ) ఔకాత్ ఏంటో బయటపెడతామంటూ సవాళ్లు విసురుతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పెద్దలు రాజకుటుంబం నుంచి వచ్చారని.. తాను కేవలం ఒక సేవకుడిని మాత్రమేనని, తనకు పెద్ద స్థాయి లేదని వ్యాఖ్యానించారు. స్థాయిల సంగతి పక్కనపెట్టి.. అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని ప్రతిపక్షానికి ఛాలెంజ్ చేశారు. అయినా తన దృష్టంతా ఇప్పుడు దేశ ప్రగతిపై మాత్రమే ఉందని.. అవమానాలు, దూషణలను తాను జీర్ణించుకుంటానని మోడీ చెప్పారు.
నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వారిని తన పక్కన పెట్టుకొని.. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారంటూ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్మదా ప్రాజెక్టును వ్యతిరేకించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని గుజరాత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నర్మదా ప్రాజెక్ట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని తాను గతంలోనే గట్టిగా వాదించానని, ఇప్పుడు ఈ లాభాలన్నీ కళ్లముందే కనిపిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న వారికి (రాహుల్ గాంధీని ఉద్దేశించి) వేరుశనగ పంటకు, పత్తి పంటకు మధ్య తేడా తెలియదని సెటైర్లు వేశారు. కొందరు వ్యక్తులు గుజరాత్ ఉప్పు తింటూ.. ఈ రాష్ట్రాన్నే అవమానిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. తమతమ నియోజకవర్గాల్లో చేసిందేమీ లేదని మోడీ విమర్శించారు. సౌనీ యోజన ద్వారా సురేంద్రనగర్‌కి నర్మదా నీళ్లు తీసుకురాలేదని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీని గెలిపిస్తే.. ప్రతీ నియోజకవర్గంలోని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో బీజేపీకి వచ్చే ఐదేళ్లు.. 25 ఏళ్లలో మీ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు.