Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..

  • మమతా బెనర్జీకి భారీ షాక్..
  • నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థి విత్ డ్రా..
  • సీఎం సువేందుతో భేటీ తర్వాత సంచితా ప్రధాన్ కీలక నిర్ణయం..
  • ఇటీవల సంచితా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మమతా.
  • సీఎంతో భేటీ తర్వాత గంటల్లోనే కీలక పరిణామం..
Tmc

Tmc

Mamata Banerjee: ఇప్పటికే పార్టీని, ఎన్నికల గుర్తును కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. రాబోయే నందిగ్రామ్ ఉప ఎన్నికల బరి నుంచి మమతా వర్గం అభ్యర్థి విత్ డ్రా అయ్యారు. నందిగ్రామ్ బై ఎలక్షన్స్ కోసం మమతా వర్గం తమ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డే అనే మహిళా టీచర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయిన కొన్ని గంటల్లోనే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. సువేందుతో భేటీ తర్వాత ఎన్నికల పోటీ నుంచి బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, మమతా బెనర్జీకి రాజకీయ తలనొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే టీఎంసీలో వర్గ పోరు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఈసీ టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. మమతా వర్గానికి ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’ గుర్తు, రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తును కేటాయించింది. ఈ గుర్తులపైనే రెండు వర్గాలు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈసీ ఈ గుర్తుల కేటాయింపు చేసిన కొన్ని గంటల్లోనే మమతాకు సంచితా బిగ్ షాక్ ఇచ్చారు.

ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసింది. మమతా బెనర్జీ భవానీపూర్‌ నుంచి ఓడిపోయారు.ఈ స్థానం నుంచి పోటీ చేసిన సువేందు అధికారి మమతను చిత్తుగా ఓడించారు. సువేందు భవానీపూర్‌‌తో పాటు నందిగ్రామ్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్నికల తర్వాత భవానీపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగడానికే ఇష్టపడి, నందిగ్రామ్‌కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌కు బైఎలక్షన్లు అనివార్యమయ్యాయి. టీఎంసీ ఘోర పరాజయం తర్వాత వర్గపోరు ముదిరింది.