Hasnuram Ambedkari: అతను 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన హస్నురామ్ అంబేర్కరీ ఎంపీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈ సారి తాను రెండు స్థానాల్లో పోటీ చేస్తానని, తాను ఓడిపోతానేమో కానీ 100వ సారి పోటీ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీతో జీవనోపాధి పొందుతున్న అంబేద్కరీ సెంచరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యూపీ ఆగ్రా జిల్లా ఖేరాగఢ్ తహసీల్‌కి చెందిన అంబేద్కరీ 1985 మార్చి నెలలో జిల్లాలోని ఖేరాఘర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీఎస్పీ అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 1985 నుంచి గ్రామస్థాయి, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ ఇలా ఎన్నికల్లో పోరాడుతూనే ఉన్నారు. అయితే అన్ని సార్లు ఆయన ఓడిపోతూనే వస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆయన మళ్లీ ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు పత్రాలు సిద్ధం చేసుకున్నారు.
Read Also: Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు షాక్.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. అసలు ఏమైందంటే?
అయితే, ఓ అవమానమే తనను వరసగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రేరేపించిందని అంబేద్కరీ చెప్పారు. ఆగ్రా తహసీల్‌లో తన ఉద్యోగాన్ని వదలిపెట్టానని చెప్పారు. బీఎస్పీ తరుపున ఖేరాఘర్ టికెట్ ఇస్తామని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేశానని, అయితే పార్టీ కన్వీనర్ నాకు టికెట్ నిరాకరించడంతో పాటు మీ భార్య మీకు ఓటేయదని, ఇతరులు ఎవరు ఓటేస్తారని అవమానించారని, అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
తన భార్య శివాదేవీ(70) తన కుమారులు ఎన్నికల పోటీకి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. నాకు ఐదుగురు కుమారులు ఉన్నారని, వారంతా కూలీ పనులు చేసుకుంటూ పెళ్లిళ్లు చేసుకున్నారని, నా కోడల్లు, మనవలు, కుమార్తెలు, అందరూ ప్రచారంలో మద్దతు ఇస్తున్నారని ఆయన చెప్పారు. సోమవారం తాను పోటీ చేయబోయే స్థానాలకు నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు.