Sukhant Funeral Company: ఈరోజుల్లో వ్యాపారానికి సాటిరాని వస్తువు అంటూ ఏం లేదు. ఆవుల పేడను కూడా ఆన్‌లైన్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. చివరకు మనిషి చావును కూడా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ మనిషి అంత్యక్రియలను నిర్వహిస్తామంటూ పబ్లిసిటీ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో ముంబైకు చెందిన సుఖాంత్ ఫ్యునరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మేరకు ఓ స్టాల్ పెట్టి అంత్యక్రియలను తమ కంపెనీ ఎలా నిర్వహిస్తుందో డెమో ద్వారా చూపిస్తోంది. అంటే ఎవరి ఇంట్లో అయినా పెళ్లి జరుగుతుంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లే.. ఇప్పుడు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కాంట్రాక్ట్ కూడా ఇవ్వాలని ఈ కంపెనీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అంత్యక్రియల కోసం రూ.38,500 కట్టి మెంబర్ షిప్ తీసుకోవాలి.
Read Also:Baby: చిన్నకొండ తోపు.. దమ్ముంటే ఆపు.. జంబలకిడి జారు మిఠాయ
మనిషి అంత్యక్రియలకు మెంబర్ షిప్ తీసుకుంటే శవపేటిక, శవాన్ని మోసేందుకు అవసరమైన వాళ్లు, శవాన్ని చూసి ఏడ్చేవాళ్లు, పూజలు చేసేవాళ్లు, అంతిమ యాత్ర సమయంలో అమర్ రహే అంటూ నినాదాలు చేసేవాళ్లు.. ఇలా ప్రతి అంశంలోనూ ఈ కంపెనీ మనుషులను అద్దెకు అరేంజ్ చేస్తుంది. అయితే ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వివరిస్తుండటంతో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చాలా మంది మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. వ్యాపారానికి హద్దు ఉండదా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఈ కంపెనీ అందిస్తున్న సేవలను అభినందిస్తున్నారు. ఫ్యామిలీ లేనివారికి ఈ కంపెనీ సేవలు ఒక వరమని ప్రశంసిస్తున్నారు.
కాగా సుఖాంత్ కంపెనీ సీఈవో సంజయ్ రామ్‌గూడే మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ కంపెనీ 5వేలకు పైగా అంత్యక్రియలను నిర్వహించిందని వివరించారు. ఇప్పటివరకు రూ.50 లక్షల టర్నోవర్‌ను తమ కంపెనీ సాధించిందని గొప్పగా చెప్పుకున్నారు. ప్రస్తుతం తమ కంపెనీ నవీ ముంబై, ముంబై, థానేలలో సేవలు అందిస్తోందని తెలిపారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు కూడా తమ సేవలను విస్తరిస్తామని చెప్పారు.
