Pradeep Sharma: 2006లో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తా బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది. ట్రయల్ కోర్టు శర్మకు వ్యతిరేకంగా లభ్యమైన అపారమైన సాక్ష్యాలను పట్టించుకోలేదని, సాధారణ సాక్ష్యాధారాలు ఈ కేసులో అతడి ప్రమేయాన్ని తెలియజేస్తోందని కోర్టు పేర్కొంది. మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది. పోలీసులతో సహా 13 మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవితఖైదు శిక్షల్ని హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
Read Also: Ambati Rambabu: ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్.. ఆ కూటమికి ఓటేస్తే 4శాతం రిజర్వేషన్ పోయినట్లే
2013లో సెషన్స్ కోర్టు సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే మరణించారు. ప్రదీప్ శర్మను సెషన్స్ కోర్టు నిర్దోషిగా విడుదల చేయడాన్ని బాధితుడి తమ్ముడు హైకోర్టులో అప్పీల్ చేశాడు. 2006, నవంబర్ 11న గుప్తా అలియాస్ లఖన్ భయ్యా, రాజన్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడనే అనుమానంతో గుప్తాతో పాటు అతని స్నేహితుడు అనిల్ భేడాలను పోలీసులు అరెస్ట్ చేసి, అదే రోజు సాయంత్రం సబర్బన్ వెర్సోవాలో నాని పార్క్ ప్రాంతంలో నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేశారు.