Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

  • ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్..
  • 40 నిమిషాల పాటు సంభాషణ..
  • ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి గురించి చర్చ..
Moditrump

Moditrump

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్‌తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘‘ నా మిత్రుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి చర్చించాము. హార్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాము’’ అని పేర్కొన్నారు.

Read Also: Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..

ఈ ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ యుద్ధం, వాణిజ్యంపై చర్చించినట్లు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడగలదని, రాబోయే కొద్ది రోజుల్లో భారత్ అమెరికాల మద్య ఇంధనంతో పాటు కొన్ని అతిపెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికా భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తుందని ట్రంప్ మోడీతో అన్నారని గోర్ తెలిపారు.

ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో యూఎస్-ఇరాన్ మధ్య 21 గంటల పాటు శాంతిచర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. చర్చలు విఫలమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దిగ్భంధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.