Site icon NTV Telugu

PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి

Pmmodi2

Pmmodi2

PM Modi: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ప్రపంచంలోని వివిధ రాజకీయ ప్రముఖులు, సంస్థలు ప్రధాని నరేంద్రమోడీ యుద్ధాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనే థింక్ ట్యాంక్‌లో ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అలీ వాజ్ మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ చొరవ తీసుకోవాలని, పరిణతి, అనుభవం ఉన్న దేశంగా భారత్ ఈ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించగలదని అన్నారు.

ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనేది బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలపై నివేదిక అందిస్తుంది. ఇది ఏ ప్రభుత్వానికి లేదా ఏ అధ్యక్షుడి ఆధీనంలో ఉండదు. అలీ వాజ్ ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, ఇరాన్ సంబంధిత విషయాలకు నాయకత్వం వహిస్తున్నారు. దీనిపై అలీ వాజ్ మాట్లాడుతూ.. అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న ప్రధాని మోడీ ఉద్రిక్తతలు తగ్గేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.

Read Also: Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!

భారత్ నుంచి మరిన్ని చర్యలను ఆశిస్తున్నామని, భారత్ ఎంతో చేయగలని, హార్ముజ్ జలసంధి మూసివేసిన తరుణంలో భారత్ అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఒక ఒప్పందానికి ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. ఈ దశలో కాల్పుల విరమణకు అవకాశం లేదని, రెండు పక్షాలు కూడా ఒకరినొకరు దెబ్బ కొట్టగలమని నమ్ముతున్నాయని ఇలాంటి సమయంలో భారత్ చొరవ తీసుకోవాలని అలీ వాజ్ కోరారు.

గతంలో ఇరాన్, అమెరికా యుద్ధాన్ని మోడీ ఆపగలరని కొంత మంది అమెరికన్ నిపుణులు కూడా అనడం గమనార్హం. భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వస్తే, అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోదీల మధ్య చర్చలు ముందుకు సాగవచ్చని అమెరికన్ యుద్ధ నిపుణుడు డగ్లస్ మెక్‌గ్రెగర్ అన్నారు. రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి ప్రధాన శక్తుల మధ్య విశ్వాస వారధిగా మారే సత్తా ప్రధాని మోదీకి ఉందని మెక్‌గ్రెగర్ అన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆర్థిక,రాజకీయ అస్థిరత కారణంగా పాక్ తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.

Exit mobile version