భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. ఈ కారణంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. దాదాపు నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏ ఫోన్ కాల్‌ను మోడీ లిఫ్ట్ చేయలేనట్లుగా సమాచారం. కొత్త సుంకం అమల్లోకి రాకముందు వారంలో దాదాపు ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్స్ ఎత్తకుండా మోడీ తప్పించుకున్నారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. భారీగా సుంకం విధించడంతో మోడీ కోపంగా ఉన్నారని.. ఆ కారణం చేతనే ట్రంప్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్గెమైన్ జైటంగ్ వర్గాలు ఉటంకిస్తూ కథనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ ఫోన్ కాల్స్‌ను మోడీ పట్టించుకోలేదని.. ట్రంప్‌కు నిరసనగా మోడీ ఇలా చేశారని రాసుకొచ్చింది. సుంకాల విషయంలో మోడీ చాలా చిరాకుగా ఉన్నారని కూడా పేర్కొంది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే పాకిస్థాన్‌తో ట్రంప్ సంబంధాలు పెంచుకోవడంపై కూడా మోడీ కోపంగా ఉన్నారని తెలిపింది. భారత్‌పై మక్కువ తగ్గి.. పాకిస్థాన్‌తో సంబంధాలు పెంచుకోవడం కూడా ఒక కారణం అని వార్తా పత్రిక వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ట్రంప్ సుంకాలను భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అన్నదాతల కోసం ఎంతైనా భరిస్తామని.. రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడబోమని మోడీ తేల్చి చెప్పారు. వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ విశ్లేషకుడు మార్క్ ఫ్రేజియర్ స్పందిస్తూ.. చైనాను అదుపు చేసేందుకు గతంలో భారత్‌తో ట్రంప్ మంచి సంబంధాలు పెట్టుకున్నారని.. రెండు దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగాయన్నారు. ఇప్పుడు సుంకాలు కారణంగా భారత్-చైనా సంబంధాలు బలపడుతున్నాయని చెప్పుకొచ్చారు. చైనాతో సంబంధాలు కారణంగా తిరిగి భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
