Average smartphone consumption in India increases: ఇండియాలో మొబైల్ వినియోగం పెరుగుతోంది. ప్రజలు మొబైల్ పై గడిపే సమయం గతంలో కన్నా పెరిగింది. తాజాగా మొబైల్ ఎనలిటిక్స్ సంస్థ డాటా. ఎఐ ప్రకారం ఇండియాలో సగటున వినియోగదారుడు రోజుకు 4.7 గంటలు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. ఇది 2019లో 3.7 గంటలు, 2020లొో 4.5 గంటలు ఉంటే.. 2021లో 4.7 గంటలకు పెరిగిందని వెల్లడించింది.
కోవిడ్ మహమ్మారి వల్ల మొబైల్ ఫోన్లతో గడిపే సమయం పెరిగినట్లు తెలిపింది. అయితే లాక్ డౌన్ తర్వాత కూడా మొబైల్ వినియోగం ఏమాత్రం తగ్గలేదని డాటా.ఏఐ వెల్లడించింది. గతంలో కన్నా ఎక్కువగా మొబైల్ పై గడిపే సమయం పెరిగిందని తెలిపింది. 2021లో చాలా మంది మొబైల్ యూజర్స్ ఎక్కువగా సోషల్ మీడియా యాప్స్, వీడియో యాప్స్ పైనే ఎక్కువ సమయం గడిపారు. 2021 యాప్ డౌన్ లోడ్స్ లో ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో నిలిచింది. దాదాపుగా ఇండియా వ్యాప్తంగా 27 బిలియన్ల డౌన్ లోడ్స్ జరిగినట్లు నివేదిక తెలిపింది.
2021లో ప్రతీ పది నిమిషాల్లో 7 నిమిషాలు సోషల్ మీడియా, ఫోటో, వీడియో యాప్స్ లనే వినియోగదారులు చూశారు. ఇదిలా ఉంటే 2021లో ఆండ్రాయిడ్ లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ 205.4 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకోగా.. ఫేస్ బుక్ ను 163.6 మిలియన్ డౌన్‌లోడ్‌లతో రెండవ స్థానంలో నిలిచింది. భారత్ కన్నా ఇండోనేషియా, సింగపూర్, బ్రెజిల్ దేశాల వినియోగదారులు 5 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లలో గడుపుతున్నారు. ఇదే సమయంలో ఇండోనేషియా, సింగపూర్, బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, రష్యా, టర్కీ, యుఎస్, యుకె వినియోగదారులు సగటున 4 గంటల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు.