Waqf Row: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు వక్ఫ్ చట్టానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన మణిపూర్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండి అస్కర్ అలీ ఇంటికి సుమారు 8 వేల మందితో కూడిన ఓ గూంపు వెళ్లి నిప్పు పెట్టింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక, దీనిపై అలర్ట్ అయిన స్థానిక పోలీసులు.. బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడి ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అయితే, తన ఇంటిపై దాడి జరగడంతో ముస్లిం సమాజానికి అలీ క్షమాపణలు చెప్పారు.
Read Also: NBK : కథల వడపోతలో బాలయ్య బిజీబిజీ
ఇక, ఈ ఘటనతో తౌబాల్ జిల్లాలోని లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండొద్దు, తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్ళు లేదా ఇతర ప్రాణాంతక ఆయుధాలను ప్రజలు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని సమాచారంతో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ లోయలో గల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశాం.. అదనపు బలగాలను మోహరించామని అధికారులు తెలిపారు. అయితే, పార్లమెంటు ఉభయ సభలలో సుదీర్ఘ చర్చల తర్వాత గురువారం లోక్‌సభ, శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదించాయి. ఇక, శనివారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.