Mehbooba Mufti comments on Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టంగా ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లఘించడమే అని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, ద్రవ్యోల్భాన్ని నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం మసీదులు పడగొట్టడంలో ‘‘విశ్వగురువు’’ అవుతామని బీజేపీని ఎద్దేవా చేశారు.
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న హిందూ దేవతలను ప్రతీరోజూ పూజించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై వారణాసి కోర్టు, మసీదు కమిటీ వాదనలను తోసిపుచ్చింది. భక్తులు రోజూవారీ పూజలకు అనుమతి కోరే స్థలంలో అప్పటికే విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయని.. అందుకే ఈ కేసులో 1991 ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదని వారణాసి జిల్లా కోర్టు పేర్కొంది. మత నిర్మాణాలపై 1947 తర్వాత యథాతథ స్థితిని తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చని 1991 చట్టాన్ని కోర్టు గౌరవించలేదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు తీర్పు అల్లకల్లోలాకలు దారి తీస్తుందని.. ఆమె ట్వీట్ చేశారు.
Read Also: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు దూల తీరింది.. హైకోర్టు వినూత్న శిక్ష
దేశంలో ఇద్దరు మినహాయిస్తే.. ప్రజలంతా రోజురోజుకు పేదవారిగా మారతున్నారని.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా మారబోతోందని బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోందని.. మసీదులను పడగొట్టడంలో మనం విశ్వగురువు అవుతామని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మహబూబా ముఫ్తీ.
హిందువులు, ముస్లింలను విభజించడంలో బీజేపీ ముందుందని.. తన ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తుందని విమర్శించారు ఆమె. ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రజల హక్కులను లాక్కుందని ఆమె బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, కార్యకర్తలను బీజేపీ జైలుకు పంపుతోందని.. రాజకీయ నాయకుల నోరును మూయించి, బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.