Live-in-relationship:‘‘లిన్- ఇన్ రిలేషన్’’లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒక భాగస్వామికి అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకోనట్లయితే, సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని తీర్పు చెప్పింది. లివ్-ఇన్‌లో ఉంటున్న ఒక జంట రక్షణ కోరిన తర్వాత, రక్షణ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 16న ఈ కేసుపై న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణం కాదని, అది అప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టబద్ధ హక్కులను ఉల్లంఘించకూడదని అన్నారు.
Read Also: Rahul Gandhi: జార్జ్ సోరోస్ వ్యక్తితో రాహుల్ గాంధీ.. “రెండు శరీరాలు, ఒకే ఆత్మ” అంటూ బీజేపీ ఫైర్..
కేసు వివరాల్లోకి వెళ్తే.. పిటిషన్ దాఖలు చేసిన జంట, తాము ఇద్దరం ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నామని, తాము మేజర్లమని, ఇతరుల వ్యతిరేకత కారణంగా తమకు భద్రతకు ప్రమాదం ఉందని భయపడుతున్నామని కోర్టుకు తెలిపారు. తమ సంబంధాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు కింద రక్షించాలని వాదించారు. అయితే, పిటిషనర్లలో ఒకరైన దినేష్ కుమార్‌కు ఇప్పటికే పెళ్లయిందని, విడాకుులు తీసుకోలేదని, దీని కారణంగా కలిసి జీవించడాన్ని చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కోర్టు తన తీర్పులో.. ‘‘ ఇద్దరు పెద్దవాళ్ల వ్యక్తిగత జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు. తల్లిదండ్రులు కూడా.. కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఒకరి స్వేచ్ఛ, మరొకరి చట్టబద్ధ హక్కులను కాలరాయలేదు. ఒక వ్యక్తికి ఇప్పటికే వివాహమై ఉంటే, జీవిత భాగస్వామి జీవించి ఉంటే, చట్టబద్ధంగా విడాకులు పొందకుండా మూడో వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటే అనుమతి ఇవ్వలేం’’ అని చెప్పింది. వివాహం ద్వారా ఏర్పడే చట్టపరమైన బాధ్యతల్ని విస్మరించలేమని, అలాగే లివ్ ఇన్ రిలేషన్ కూడా చట్ట పరిమితులకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.