Rajastan: 21 ఏళ్ల వయస్సులో మహిళ వివాహాన్ని కుటుంబ న్యాయస్థానం రద్దు చేసింది. అదేంటి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాల్యవివాహాలు చేస్తూ అమ్మాయిల అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఆ యువతి పోరాడి తన హక్కులను సాధించింది. రాజస్థాన్‌కు చెందిన రేఖ అనే అమ్మాయికి చిన్ననాటనే తన తాత చనిపోవడంతో తన గ్రామానికి చెందిన అబ్బాయితో ఏడాది వయసులో వివాహం చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆమె అత్తమామలు ఆమెను ‘గౌన’ (వివాహానికి సంబంధించిన ఆచారం) కోసం ఒత్తిడి చేశారు. ఆమె అప్పుడు ఏఎన్‌ఎం ఉద్యోగం సాధించడానికి సిద్ధమవుతోంది. ఆమె కల చెదిరిపోకూడదనుకుంది. కాబట్టి, ఆమె అంగీకరించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అనే ఎన్జీవోను సంప్రదించింది. అనంతరం వారి సహకారంతో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి సమాజానికి చేసిన నేరమే..
తొలుత లొంగిపోవడానికి ఇష్టపడని ఆమె అత్తమామలు కుల పంచాయితీ చేసి రూ.10 లక్షల నగదు జరిమానాతో రేఖ కుటుంబాన్ని బెదిరించారు. రేఖ బెదరకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం కుటుంబ న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వందేళ్ల నుంచి బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపలేదని, ఇప్పుడు అందరూ కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశంతో ఆనందం వ్యక్తం చేసిన రేఖ, ఇది ఒక కల నిజమైందని.. ఇప్పుడు తాను ఏఎన్‌ఎం కావడంపై దృష్టి సారిస్తానని అన్నారు. “ఈరోజు నా పుట్టినరోజు. ఈ రోజు నాకు 21 ఏళ్లు మరియు ఈ రద్దు నాకు, నా కుటుంబానికి పుట్టినరోజు బహుమతిగా వచ్చింది” అని ఆమె ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.