ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్) బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపింది. ఇటీవల ఆమె ఇస్కాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై పూర్తి నిరాధార ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారని ఇస్కాన్ పేర్కొంది. ఇస్కాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తాము న్యాయం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.
Read Also: CBFC Corruption: విశాల్ ఆరోపణలకు దిగొచ్చిన కేంద్రం.. విచారణకు ఆదేశం!
కొన్ని రోజుల క్రితం మేనకా గాంధీ ఇస్కాన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇస్కాన్ గోవులను కసాయిలకు విక్రయిస్తోందని ఆమె ఆరోపించారు. ఇస్కాన్ దేశంలో అతిపెద్ద మోసమైందని ఆరోపణలు చేశారు. ఇస్కాన్ గో శాలలు స్థాపించి ప్రభుత్వం నుంచి విస్తారంగా భూములు సేకరించి అపరిమిత ప్రయోజనాలు పొందుతోందని ఆమె అన్నారు.
Read Also: Google Layoff: “నా గుండె పగిలిపోయింది”.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే గూగుల్ ఉద్యోగి లేఆఫ్..
తాను ఇటీవల ఏపీలోని ఇస్కాన్ గోశాలను సందర్శించానని, అక్కడ ఒక్క ఆవు కూడా లేదని ఆమె అన్నారు. గోశాలలోని దూడలు లేవని, అవన్నీ అమ్ముడయ్యాయని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై రూ. 100 కోట్లకు పరువునష్టం కేసు వేశారు.