దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు 30 ఏళ్ల విభోర్ సాహు భార్య రీతు(23)ను కత్తెరలో పొడిచి చంపాడు. అనంతరం సాహు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం జబల్ పూర్ లోని సాహు ఇంటిలో చూడగా విబోర్ సాహు మృతి చెందగా, అతని భార్య రీతు రక్తపు మడుగులో పడి ఉన్నారని రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ సహదేవ్ రామ్ సాహు తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉండే తల్లి, సోదరుడు బయటకు వెళ్లారని.. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇద్దరు చనిపోయి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ గా ఉన్న విభోర్ సాహు గత 15 రోజులుగా విధులకు వెళ్లడం లేదు. దీంతో భార్య తమ జీవనోపాధి దెబ్బతింటుందని..పదేపదే చెప్పినందుకు సాహు ఈ హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత భార్య రీతూను కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి.. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.