చిన్నతనంలో సరిగా చదవకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా పెద్దయ్యాకా గాడిదలు కాస్తావా.. అంటూ చాలా మంది అంటుంటారు. కానీ ఓ ఐటీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని, ఆరంకెల జీతాన్ని వదిలి గాడిదలు కాస్తున్నాడు. నిజమేనండోయ్.. గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారంను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలిన శ్రీనివాస్ గౌడ్.. రూ.42లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో ఫారం పెట్టారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెట్టిన గాడిదల పెంపకం, శిక్షణాకేంద్రం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.
2020 వరకు ఐటీ ఉద్యోగం చేసిన శ్రీనివాస్ గౌడ్ కరోనా, లాక్ డౌన్‌లతో దానికి స్వస్తి చెప్పాడు. అనంతరం దాన్ని వదిలేసి గాడిదలు కాస్తున్నానని ఆయన చెప్పాడు. దేశంలో ఇదొక ప్రత్యేకమైన, కర్ణాటకలోనే మొదటి గాడిదల పెంపకం, పాల ఉత్పత్తి కేంద్రంగా అతడు పేర్కొన్నాడు.
‘‘గాడిద పాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి, అందుకే గాడిద పాలు అందరికీ అందుబాటులో ఉంచాలనేది నా కల. ఈ పాలు ఔషధ ఫార్మలా’’ అని గౌడ్ వివరించారు. గాడిద జాతుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో తాను గాడిదల పెంపకం ఫాం పెట్టినట్లు యజమాని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గాడిద ఫారమ్ గురించి మొదట్లో ప్రజలు నమ్మలేదని ఆయన పేర్కొన్నారు. గాడిద పాలను ప్యాకెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానని, 30 మిల్లీలీటర్ల గాడిద పాల ప్యాకెట్ ధర 150 రూపాయలని ఆయన వివరించారు. దేశంలో గాడిద సంతతి తగ్గిపోతుండడంతో తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.
గాడిద పాల ప్యాకెట్లను షాపింగ్ మాల్స్, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. తనకు ఇప్పటికే రూ.17లక్షల విలువైన గాడిద పాల ఆర్డర్లు వచ్చాయని మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన శ్రీనివాస్ గౌడ్ వివరించారు.