ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం సంస్థలు సహా ప్రతిఒక్కరూ ఈ ఘటనని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని.. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందన్న ఆమె.. ప్రతి ఒక్కరినీ శాంతిని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేశారు.
మరోవైపు.. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో భాగంగా నుపుర్ శర్మ పేరు ప్రస్తావించకుండానే దీదీ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు, ఫేక్ ప్రచారాల్ని నడిపిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ‘‘సోషల్ నెట్‌వర్క్‌లకు నేను అనుకూలమే కానీ, నిజాలు మాట్లాడే వారి పక్షాన మాత్రమే ఉంటాను. అయితే.. బీజేపీ సోషల్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వాళ్ల దగ్గర చాలా డబ్బుంది. అందుకే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో అబద్ధాలాడుతున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా ఓ నేత (నుపుర్‌ని ఉద్దేశించి) మాట్లాడితే.. కనీసం అరెస్ట్ చేయనివ్వడం లేదని.. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని దీదీ ప్రశ్నించారు.
‘‘వాళ్లు చంపితే.. ఎవరూ నోరు విప్పకూడదు. అదే వేరేవాళ్లు మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా? జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? మీ దగ్గరున్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం’’ అంటూ మమతా హెచ్చరించారు.