త్వరలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలు ఒకెత్తు అయితే.. పశ్చిమ బెంగాల్ మరొకెత్తు. బెంగాల్లో ఎప్పటి నుంచో పాగా వేయాలని కాషాయ పార్టీ కలలు కంటోంది. కానీ సాధ్యపడలేదు. ఈసారైనా బెంగాల్లో బీజేపీ జెండా పాతాలని మేథోమధనం చేస్తోంది. ఇంకోవైపు నాలుగోసారి అధికారాన్ని స్థిరపరుచుకోవాలని మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తోంది. ఇలా బీజేపీ వర్సెస్ మమత మధ్య వ్యూహాలు-ప్రతివ్యూహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య భీకర పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆలయాల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు మమత ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం.. దేనిపై ప్రమాణం చేశారంటే..!
ఇటీవల మమతా బెనర్జీ ఆలయాల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. బీజేపీ నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా సమాచారం. ఈ ఏడాదిలోనే దిఘాలో జగన్నాథ ఆలయ పనులు ప్రారంభించారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌లో దుర్గా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో మహాకాళ్ ఆలయ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 17 ఎకరాల్లో దుర్గా అంగన్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనపై చాలా మంది ఆరోపణలు చేస్తారని.. బుజ్జగింపు రాజకీయాలు చేస్తానని నిందిందిస్తారని వ్యాఖ్యానించారు. వాస్తవంగా తాను లౌకికవాదిని అని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను నమ్ముతానని.. శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తానని చెప్పుకొచ్చారు. అయినా తాను హాజరుకాని ఏ వేడుకలు ఉన్నాయని మమత ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Zelensky: రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్స్కీ కీలక ప్రకటన
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ.. ముస్లింలను సంతృప్తిపరిచే పార్టీగా తమపై ఎప్పుడూ బీజేపీ ముద్ర వేస్తోందని.. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్మాణంతో ఆ విమర్శ పోతుందని.. అన్ని విశ్వాసాలను గౌరవించే నాయకురాలిగా మమత ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు.
ఇక బీజేపీ కూడా మమతకు ధీటుగా ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.