బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను కలుగచేశాయి. ఢిల్లీ నుంచి మొదలుకుని ఉత్తర్ ప్రదేశ్, రాంచీ, హైదరాబాద్, హౌరా ఇలా పలు ప్రాంతాల్లో ముస్లింల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్ రాంచీలో అల్లర్లలో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో నిరసన పేరుతో అల్లర్లకు పాల్పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసులను దగ్ధం చేశాయి అల్లరిమూకలు.
ఇదిలా ఉంటే అల్లర్లపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌరాలో హింసకు బీజేపీనే కారణం అని నిందించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న హింస వేనక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. వారు అల్లర్లు చేయాలనుకుంటున్నారు.. కానీ వాటిని సహించను, అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ట్వీట్ చేశారు.
శుక్రవారం మొదలైన అల్లర్లు శనివారం కూడా కొనసాగాయి. శనివారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలను జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. జూన్ 15 వరకు 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాలు. బెంగాల్‌ను సురక్షితంగా ఉంచడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు.
రోడ్లను, రైల్వే లైన్లను దిగ్భందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. సామాన్యులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆందోళనకారులను సీఎం మమతా బెనర్జీ కోరారు. మీరు నిరసన తెలపాలంటే ఢిల్లీ లేదా గుజరాత్, యూపీ వెళ్లి నిరసనలు తెలపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రుణమూల్ గుండాలు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులను కొడుతున్నారని బీజేపీ పార్టీ ఆరోపిస్తోంది.