Site icon NTV Telugu

Mallikarjun Kharge: ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’.. మోడీకి ఉగ్రదాడి గురించి ముందే తెలుసు..

Mallikarjunkharge

Mallikarjunkharge

Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే ప్రధాని నరేంద్రమోడీకి సమాచారం ఉందని ఆరోపించారు. ఆ తర్వాతే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే మరోసారి అన్నారు. దాడి జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు.

కర్ణాటకలో జరిగిన సమర్పణే సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏప్రిల్ 17న కాశ్మీర్‌లో పర్యటించి ఉండాల్సింది, కానీ నిఘా వర్గాల సమాచారం మేరకు రద్దు చేసుకున్నారని, దీని గురించి మీకు ముందే తెలుసా..? అని ప్రధానిని ప్రశ్నించారు. దీని గురించి ఎందుకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదు, ముందే హెచ్చరించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లం అని అన్నారు. ‘‘ఇప్పుడు అక్కడక్కడ చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ చైనా మద్దతుతో భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తోంది’’ అని అన్నారు.

Read Also: Turkey: టర్కీ, అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు..

“26 మంది పౌరులు మరణించగా, ప్రధాని మోదీ బీహార్‌లో ర్యాలీ నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి, ప్రధానమంత్రి కూడా హాజరు కాలేదు. మేము ఆ సమావేశాలకు దూరంగా ఉంటే, మమ్మల్ని దేశద్రోహులుగా పిలుస్తారు. కానీ మోదీ వాటిని సమావేశాలకు రాకుంటే, దానిని దేశభక్తిగా ముద్ర వేస్తారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?” అని ఖర్గే ప్రశ్నించారు.

ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని, సాయుధ దళాల ధైర్యాన్ని మోసం చేయడమే అని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఒక చిన్న యుద్ధం అని ఖర్గే జీ చెబుతున్నారు. మన సాయుధ దళాలు పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రాహుల్ గాంధీ, ఖర్గే జీ అర్థం చేసుకోలేకపోతున్నారా? పాకిస్తాన్ 11 వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి, నేడు పాకిస్తాన్ బాధతో ఏడుస్తోంది.’’ అని అన్నారు.

Exit mobile version