రాజ్యసభలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఖర్గేపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ భూములను ఖర్గే కబ్జా చేశారంటూ ఆరోపించారు.
తాజాగా అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకురాకపోతే సభలో క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా తాను రాజకీయ దాడులకు ఏ మాత్రం బెదిరిపోనని.. ఈ సందర్భంగా ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పారు.