Bangladesh: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దైవ దూషణ చేశాడనే ఆరోపణలతో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు దాస్‌పై మూక దాడికి పాల్పడి, అతడిని దారుణం హత్య చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. దీని తర్వాత కూడా పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. దీపు హత్య కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఉపాధ్యాయుడు యాసిన్ అరాఫత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనే ఈ హత్యకు ప్రణాళిక రచించి, అమలు చేసినట్లు భావిస్తున్నారు.
Read Also: US-Venezuela: వెనిజులా చమురును మేమే నియంత్రిస్తాం.. స్పష్టం చేసిన అమెరికా..
డిసెంబర్ 18న బంగ్లాదేశ్ ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న మైమన్‌సింగ్ జిల్లాలో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు బలవంతంగా రాజీనామా చేయించి, కార్యాలయం నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఆగ్రహంతో ఉన్న మతోన్మాద గుంపుకు అప్పగించారు. దీంతో వారు దీపును దారుణంగా కొట్టి, హతమార్చారు. అతడి సహోద్యోగులు కూడా దీపు హత్యలో పాలుపంచుకున్నారు. హత్య తర్వాత, నిందితుడు అరాఫత్ ఆ ప్రాంతం నుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పోలీసులు తెలిపారు.
దాడికి ప్లాన్ చేసి, గుంపును రెచ్చగొట్టి దీపును టార్గెట్ చేశారు. అరాఫత్ కేవలం రెచ్చగొట్టడమే కాకుండా, దీపును ఒక కూడలి వద్దకు ఈడ్చుకెళ్లాడని, అక్కడ చెట్టుకు కట్టేసి ఉరివేసి, నిప్పటించినట్లు పోలీసులు తెలిపారు. అరాఫత్ స్థానికంగా ఉండే మసీదులో బోధకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అరాఫత్‌తో సహా మొత్తం అరెస్టుల సంఖ్య 21కి చేరింది. దీపు దాస్ హత్య జరిగిన కొన్ని రోజులకే బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరో ఐదుగురు హిందువుల హత్యలు జరిగాయి.