మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాను తలపించేలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమానాలు రాకుండా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలలోని 38 మందితో పాటు 8 మంది స్వతంత్రులు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. గుజరాత్ సూరత్ నుంచి అస్సాం గౌహతికి రెబెల్ నేతలు క్యాంప్ మార్చారు.
మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ మహావికాస్ అఘాడీ కూటమి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే పదవి కన్నా ఇప్పుడు పార్టీని కాపాడుకునే స్థితిలో ఉన్నారు. తాజాగా ఆయన జిల్లా సేన నాయకులు, జాతీయ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే రెబెల్ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై అనర్హత వేటు వేసింది.
ప్రస్తుతం షిండే శిబిరంలో ఉన్న 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనర్హత నోటీసులు జారీ చేయబడిన ఎమ్మెల్యేలు జాన్ 27, సోమవారంలోగా తమ లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నిర్ణయంతో మహారాష్ట్ర పొలిటికల్ సీన్ ఇప్పుడు కోర్ట్ కు మారింది.