మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. శివసేన రెబల్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శిందే క్యాంప్‌లో చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే అని షిండే మీడియాకు స్వయంగా వెల్లడించారు. తమపై నమ్మకం ఉన్నవారు తమతో చేతులు కలపొచ్చని.. తాము బాలాసాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఈ నేపథ్యంలో రెబల్స్‌పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. ఈ మేరకు ఏక్‌నాథ్ షిండే సహా 11 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన షిండే.. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసింది చట్టవ్యతిరేకమని… వారికి ఆ హక్కు లేదన్నారు. తమకు మెజార్టీ ఉందన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా కీలకమన్నారు. వారికి సస్పెండ్ చేసే హక్కు కూడా లేదని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్ శిందేను తమ నాయకుడిగా పేర్కొంటూ గవర్నర్, డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లడం గమనార్హం.
మరోవైపు బలప్రదర్శనకు కూడా షిండే వర్గం సిద్ధం అవుతోంది. తాము అవసరమైన సమయంలో పార్టీ ఛైర్మన్ (ఏక్‌నాథ్) చెప్పినప్పుడు గవర్నర్ ఎదుట లేదా స్పీకర్ వద్ద బలప్రదర్శనకు సిద్ధంగా ఉన్నట్లు ఏక్‌నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉంటే తమను ఒత్తిడికి గురి చేస్తారనే అస్సాంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జిల్లా అధ్యక్షులతో ఇవాళ సమావేశం కానున్నారు. ఇప్పటికే షిండే వర్గం 400 మంది కార్పొరేటర్లతో భేటీ అయిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్ధవ్ నుంచి చేజారవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ జిల్లా అధ్యక్షులతో భేటీ ఏర్పాటు చేశారు.