Lumpy skin Disease: రాజస్థాన్ రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వ్యాధి ద్వారా మరణించిన పశువుల సంఖ్య 4 వేలను దాటింది. రాష్ట్రంలో 90,000లకు పైగా పశువులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. పశువుల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ లో మొత్తం 16 జిల్లాల్లో వ్యాధిని గుర్తించారు. బార్మర్, జోధ్ పూర్, జలోర్ జిల్లాలు వ్యాధికి ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. గంగా నగర్, హనుమాన్ గఢ్, చురు జిల్లాల్లో వ్యాధి తగ్గే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు జోధ్‌పూర్, బార్మర్, జైసల్మేర్, జలోర్, పాలి, సిరోహి, బికనీర్, చురు, గంగానగర్, హనుమాన్‌ఘర్, అజ్మీర్, నాగౌర్, జైపూర్, సికార్, జుంజును, ఉదయ్ పూర్ జిల్లాల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపించింది. బుధవారం సాయంత్రం నాటికి 4,296 మరణాలు సంభవించాయి. అత్యధికంగా గంగానగర్, బార్మర్, జోధ్ పూర్ జిల్లాల్లోని పశువులు మరణించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 94,358 పశువులకు వ్యాధి సోకగా.. వీటిలో 74,118 పశువులకు చికిత్స అందిస్తున్నారు. ఆఫ్రికాలో పుట్టిన ఈ వ్యాధి ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ లో వ్యాపించింది. పాకిస్తాన్ మీదుగానే భారత్ కు వచ్చిందని రాజస్థాన్ రాష్ట్ర పశువైద్యాధికారులు భావిస్తున్నారు.
Read Also: Snake Bite: పాము కాటుతో మరణించిన అన్న… అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా పాము కాటుకే
పశువుల్లో ఈ వ్యాధి కీలకాలు, కొన్ని రకాల ఈగలు, కలుషిత ఆహారం వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరంతో పాటు చర్మంపై పొక్కులు వంటివి ఏర్పడుతాయి. ఇది అంటు వ్యాధి కావడంతో వ్యాధి సోకిన పశువులతో ఉంటే ఇతర పశువులకు కూడా సులభంగా వ్యాపిస్తుంది. ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు, గోశాల నిర్వహకులు వ్యాధిని అడ్డుకునేందుకు ప్రభుత్వంతో సహకరించాలని అధికారులు కోరుతున్నారు. లంపీ స్కీన్ వ్యాధిని పరిశీలించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక టీములు రాజస్థాన్ కు వచ్చాయి. భోపాల్‌లోని నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌ల బృందం జోధ్‌పూర్, నాగౌర్ ప్రాంతాల నుంచి పశువుల శాంపిళ్లను సేకరించింది.