Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించాయి. మార్చి/ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షం ఎండీఎంకే అధినేత వైకో తిరుచిరాపల్లి కేంద్రంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన ప్రచార బ్యానర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఉండటం సంచలనంగా మారింది.
ఈ ఈవెంట్‌కు తమిళనాడు కాంగ్రెస్ దూరంగా ఉంది. తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే మిత్రపక్షాలుగా ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో కీలక సూత్రధారిగా ప్రభాకరన్ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీఎంకే కూటమిలోని అన్ని మిత్రపక్షాలు వచ్చినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కే సెల్వపెరుంతగై హాజరుకాలేదు. వైకో ప్రచార కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు.
Read Also: Naa Anveshana : ముగిసిన స్నేహం.. మొదలైన యుద్ధం.! అన్వేష్ కాంట్రవర్సీలో ‘ఏయ్ జూడ్’ సంచలన వీడియో
శ్రీలంకలో ఉత్తర, తూర్పు భాగంలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని ప్రభాకరన్ నేతృత్వంలో ఎల్టీటీఈ సాయుధ పోరాటం చేసింది. ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం 2009లో హతమార్చింది. అప్పటి వరకు ఎల్టీటీఈ కార్యకలాపాలు కొనసాగాయి. ఈ సంస్థకు తమిళనాడులో చాలా మంది మద్దతుదారులు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా ప్రభాకరన్‌కు మద్దతు తెలిపాయి. ఇప్పుడు, మరోసారి తమిళనాడు ఎన్నికల్లో ఎల్టీటీఈ మరోసారి ప్రధానాంశంగా నిలిచింది.
ఇదిలా ఉంటే, తిరుచ్చి నుంచి వైకో చేపట్టిన పాదయాత్రకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత ఖాదర్ మొహిదీన్, వీసీకే అధినేత తిరుమావళవన్ మరియు ఎంఎన్ఎంకు చెందిన అరుణాచలం సహా కూటమి నాయకులు హాజరయ్యారు. సీపీఐ, సీపీఎం నేతలు కూడా వచ్చారు. అయితే, ఈ సంఘటన పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపించదని, కానీ సైద్ధాంతిక విభేదాలు మాత్రం ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే, తమిళనాడు కాంగ్రెస్‌లో వర్గపోరు వీధిన పడింది. పార్టీ ఎంపీ జోతిమణి వర్గపోరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్, డీఎంకేలను బీజేపీ టార్గెట్ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు నుంచి విడుదలైన ఏజీ పెరారివలన్‌ను ముఖ్యమంత్రి స్వాగతించడంపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.